Friday, January 8, 2010

ఎవ్వనిచే జనించు జగము

ఎవ్వనిచే జనించు జగ, మెవ్వనిలోపల నుండు లీనమై
యెవ్వనియందు డిందు బరమేశ్వరుడెవ్వడు, మూలకారణం
బెవ్వ, డనాదిమధ్యలయు డెవ్వడు, సర్వము దానయైన వా
డెవ్వడు వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడెదన్.

గజరాజు నోటి నుండి పోతన్న పలికించిన పద్యం.

సి.నారాయణ రెడ్డిగారి వ్యాఖ్యానం:

సర్వేశ్వరుని మూలతత్త్వం ఈ పద్యంలో ఎన్నో దళాలతో విప్పారింది. ఇందులోని "ఎవ్వడు" అవ్యక్తుడు. ఆ అవ్యక్తరూపుణ్ణి వ్యక్తపరచటానికి 'ఎవ్వడు' అనే మాట ఎన్నో విభక్తులతో రూపుదిద్దుకుంది. అదే ఈ పద్యంలో విశిష్టత.


భావం

ఎవ్వని చేత ఈ జగమంతా సృష్టింపబడినదో, ఎవ్వని లో ఈ జగమంతా లీనమై వుందో, (ఎవ్వనియందు డిందు)ఎవ్వని చేత నాశనం చేయబడుతోందో, ఈ సృష్టికి మూలకారణం ఎవ్వడో, మొదలు, చివర, మధ్య అంతా తానే అయి వున్నవాడు ఎవడో, ఆ ఈశ్వరుణ్ణి నేను శరణు కోరుచున్నాను.

కలడందురు దీనులయెడ

కలడందురు దీనులయెడ
గలడందురు పరమయోగి గణముల పాలం
గల డందు రన్ని దిశలను
గలడు కలండనెడు వాడు గలడో లేడో

మడుగు లో జలకాలాడుతూ, మకరికి చిక్కుతాడు గజేంద్రుడు. హోరాహోరా గా సాగుతున్న ఇరువురి పోరాటంలో, గజరాజు అలసిపోతాడు, ఓటమికి దగ్గరవుతున్నప్పుడు జ్ఞానోదయం అవుతుంది. హరిని ప్రార్థించటం మొదలుపెడతాడు.

సి.నారాయణ రెడ్డి గారి వ్యాఖ్యానం
గజేంద్రుడు ప్రస్తుతం ఆర్తుడు. ఆర్తిలో అచ్చమైన సత్యమూర్తి పొరలు పొరలుగా కనిపిస్తుంది. భగవంతుడు అంతటా ఉన్నాడని అంటారు. అలా అనగా ఇతడు విన్నాడు. త్రికరణ శుద్ధిగా నమ్మి వున్నాడు. అయినా అప్పటి జంజాటంలో జీవి బుద్ధిని సంశయం కమ్ముకుంది.  'కలడు కలండనెడి వాడు' కలడో లేడో అని గుంజుకున్నాడు ఆ ముడులు విడని సంశయాత్ముడు.

ఈ సంశయాత్ముడు ఇలా సతమతమవుతూ వుంటే, ఆ నిశ్చయాత్ముడు ప్రహ్లాదుడు సర్వేశ్వరుని విషయంలో 'సందేహము వలదని' చెప్పాడు. ఇదీ ఈ ఇద్దరి మధ్యలో ఉన్న తేడా.

ఒక్క గజేంద్రుడే కాదు, ఈ లోకంలోని కోటానుకోట్ల జీవులు అప్పుడప్పుడూ ఈ పెనుగులాటతోనే సతమతమవుతున్నారు - పరమాత్ముని అస్తిత్త్వాన్ని నిరాకరించలేక, నిర్ణయించలేక.

పరమగంభీరమైన ఈ బ్రహ్మ జిజ్ఞాసను చిన్న చిన్న మాటలోలో ఎత్తిచూపి, పామరులకు కూడా పరమతత్త్వాన్ని అందజేసినాడు పోతన్న.

Sunday, December 13, 2009

శ్రీలు పొంగిన జీవగడ్డయి, పాలు పాఱిన భాగ్యసీమయి

'రాయప్రోలు సుబ్బారావు' గారు వ్రాసిన 'తమ్ముడా' గేయం శేఖర్ కమ్ముల గారి సినిమా 'లీడర్' లో విన్నాను.

అందులో

శ్రీలుపొంగిన జీవగడ్డయి,
పాలుపాఱిన భాగ్యసీమయి,
వ్రాలినది ఈ భరతఖండము
భక్తిపాడర తమ్ముడా!

అని వుంది. దానిలో నాకు కొన్ని సందేహాలు వున్నాయి. పెద్దలు సందేహనివృత్తి చేయగలరు.

శ్రీ అంటే ఇక్కడ అర్థం ఏమిటి? - సిరిసంపదలనా? అయితే సిరిసంపదలతో తులతూగే 'భాగ్యసీమయి' అనాలి కాని 'జీవగడ్డయి' అని అన్నారు ఎందుకు?

వ్రాలినది అంటే ఏమిటి?


దేశ గర్వము దీప్తి చెందగ
దేశ చరితము తేజరిల్లగ
దేశమరసిన ధీరపురుషుల
తెలిసి పాడర తమ్ముడా!

'దేశమరసిన' అంటే ఏమిటి

పూర్తి పాఠం కోసం తమ్ముడా క్లిక్ చేయండి.  (Internet explorer లో మాత్రమే కనపడుతుంది.)

Friday, December 4, 2009

మా సరివాడవా - పోతన భాగవతం

మా సరివాఁడవా మా పాపఁ గొనిపోవ
నే పాటి గలవాఁడ; వేది వంశ
మెందు జన్మించితి వెక్కడఁ బెరిఁగితి
వెయ్యది నడవడి యెవ్వఁడెఱుగు
మానహీనుఁడ వీవు మర్యాదలెఱుఁగవు
మాయఁగైకొనిగాని మలయరావు
నిజరూపమున శత్రునివహంబు పైఁ బోవు
వసుధేశుఁడవు గావు; వావి లేదు
కృష్ణా! కొమ్మనిమ్ము, నీవు గుణ రహితుండవు
విడువు - విడువవేని విలయకాల శిఖి శిఖా సమాన శితశీతలీముఖముల
గర్వమెల్లఁ గొందుఁ గలహమందు.

పద్యం కొరకు: మా సరివాడవా   క్లిక్ చేయండి.
కవి: పోతన
పాడినవారు: మాధవపెద్ది సత్యం
చిత్రం: శ్రీకృష్ణపాండవీయం


వ్యాఖ్యానం: సి.నారాయణ రెడ్డి.

రుక్మిణిని ఎత్తుకుపోతున్న కృష్ణుణ్ణి అదలించి తూలనాడుతున్నాడు రుక్మి. అతని కులాన్నీ గుణాన్నీ పేరుపేరున ఎంచి దుయ్యబడుతున్నాడు. పైకి చూస్తే అన్నీ నిందలే. రుక్మి నిందలు తప్ప అభినందనలు చేసేవాడా మరి? ఒక దుష్టపాత్ర శిష్టరక్షకుణ్ణి చెడామడా తిడుతుంటే పాపం మన పోతన్న పులుకు పులుకున చూస్తాడు. అయ్యో నా స్వామి తిట్లపాలౌతున్నాడే అని ఆందోళన పడతాడు. ఆ దుష్టునికి తెలియకుండానే వాడి పాడు నోట పరతత్త్వ రహస్యాలను పలికిస్తాడు. ఆ రకంగా తన మనసు నింపుకుంటాడు.

కృష్ణుడు రుక్మికి సరియైన వాడు కాదు - నిజమే; అందరికీ అతీతుడు.
అతడు ఏపాటి గలవాడు? - ముల్లోకాలే అతనివి. ఆ సిరియే అతనిది.
ఏది వంశం? - విష్ణుమూర్తికి ఒక వంశంమటూ వుంటుంది.
ఎందు జన్మించితివి? - జన్మ లేనిదే.

ఎక్కడు పెరిగితివి?- పెరుగుట విరుగుట నరులకు, నారాయణుని కెక్కడిది?
ఎయ్యది నడవడి? - నడిపించేవాని నడవడి ఎవడెరుగును?
మానహీనుడవు - అశరీరునకు, ఆత్మస్థిరునకి మానప్రసక్తి ఏది?
మర్యాద లెరుగవు - అనంతుడతడు.
మాయ గైకొనిగాని మలయరావు - సర్వమూ అతని మాయయే.
నిజరూపమున శత్రునివహంబుపైఁబోవు - అన్ని రూపాలూ అతనివే.
వసుధేశుడవు గావు - నిజమే ఒక్క వసుధకే కాదు చతర్దశ భువనాలకే అధీశ్వరుడు.

వావి లేదు - త్రివిక్రమునకు క్రమంతో పని లేదు.
గుణ రహితుండవు - గుణత్రయము జీవకోటికి, గుణాతీతునికేటికి?
ఇది - పైన నిందగా కనిపించినా లోన స్తుతిని దాచుకున్న పద్ధతి. అలంకారాలలో వ్యాజస్తుతి.

నల్లనివాఁడు - భాగవతం

నల్లనివాఁడు పద్మనయనంబుల వాఁడు కృపారసంబు పైఁ
జల్లెడువాఁడు మౌళిపరిసర్పిత పింఛమువాఁడు నవ్వు రా
జిల్లెడుమోమువాఁ డొకఁడు చెల్వలమానధనంబు దోచె నో
మల్లియలార! మీ పొదల మాటున లేఁడుగదమ్మ! చెప్పరే!


మనసిచ్చిన కోరికలిచ్చువాడు
శ్రీ వల్లభుడైన శౌరి యదువల్లభు భక్తి పూజసేయుమా...

పద్యం కొరకు: నల్లనివాఁడు  క్లిక్ చేయండి.
కవి: పోతన
పాడినవారు: పి.బి.శ్రీనివాస్
చిత్రం: శ్రీకృష్ణ పాండవీయం

అర్థం చెప్పండి - జయ జయ ప్రియ భారత జనయిత్రి

ఈ క్రింది సంస్కృత పద్యానికి అర్థం చెప్పగలరు..

జయ జయ జయ ప్రియ భారత జనయిత్రి దివ్యధాత్రి
జయ జయ జయ శత సహస్ర నర నారీ హృదయ నేత్రి
జయ జయ జయ సస్యామల సుశ్యామల చలచ్చేలాంచల
వసంత కుసుమలతా చరిత లలిత చూర్ణ కుంతల
జయ మదీయ హృదయాశయ లాక్షారుణ పదయుగళా
జయ జయ జయ ప్రియ భారత జనయిత్రి దివ్యధాత్రి
జయ దిశాంత గత శకుంత దివ్య గాన పరితోషణ
జయ గాయక వైతాళిక గళ విశాల పద విహరణ
జయ మదీయ మధుర గేయ చుంబిత సుందర చరణ జయ
జయ జయ జయ ప్రియ భారత జనయిత్రి దివ్యధాత్రి
--- శ్రీ దేవులపల్లి కృష్ణ శాస్త్రి
(balamitra.blogspot.com)

                                                                                                                             



శతసహస్ర అంటే లక్ష మంది మాత్రమే కదా? కాని మన జనాభా అప్పటికి 50కోట్లు అయినా ఉండిఉంటుంది కదా..
ఇంకా మిగిలిన పాదాలకు పూర్తి భావం తెలుపగలరు. జాతీయ గేయం కోసం జనగణమన తో పోటీ పడినట్లు ఎవరో అన్నారు. ఇది ఎంతవరకు నిజం?